తెలంగాణ రాష్ట్ర మంత్రులకు డబుల్ బొనాంజా దక్కనుంది. ఇప్పటికే అందరు శాసనసభ్యులతోపాటు పెరగనున్న జీతాలు అందుకోనున్న మంత్రులకు ఇక కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా రానున్నాయి. తెలంగాణలో మావోయిస్టుల కదిలికలు అధికమయ్యాయంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లను సమకూర్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చింది.
హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ పర్యటించినా మంత్రులంతా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మాత్రమే వాడాలని వారికి పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై విపక్షాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. రైతన్నల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి అంటే అందుకోసం ఒక్క పైసా విదల్చని కేసీఆర్ ఇలా ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగపరుస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.