తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్‌లో ప్రవర్తిస్తున్నారని, ఈయన పాలన కంటే సీమాంధ్ర ముఖ్యమంత్రుల పాలన ఎంతో భేష్ అని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మింట్ చేయరాదన్న డిమాండ్‌తో ఉస్మానియా వర్శిటీకి చెందిన విద్యార్థులు గత కొన్ని రోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా నిరుద్యోగ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఈ ఉద్రిక్తతకు దారితీసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఉపసంహరించుకోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకాస నేతలు కిరణ్ గౌడ్, కల్యాణ్ ఆధ్వర్యంలో ఉదయం విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు.
అప్పటికే యూనివర్సిటీలో మోహరించిన పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడిలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. విద్యార్థులను నిరుద్యోగులుగా చేస్తూ కేసీఆర్ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన కంటే సీమాంధ్రుల పాలనే బెటర్‌గా ఉన్నదని వారు వాపోయారు.