Tuesday, 18 November 2014


అర్పితాఖాన్‌.. గత కొద్దిరోజులుగా మారుమోగిపోతున్న పేరు! సల్మాన్‌ఖాన్‌ సోదరి వివాహం అంటూ మీడియా అంతా కోడై కూస్తుండగా యమా గ్రాండ్‌గా ఆ ‘ఖాన్‌’దాన్ల గారాలపట్టి వివాహం మంగళవారం అంగరంగ వైభవంగా ఒక రాయల్‌ ప్యాలెస్‌లో జరిగిపోయింది. కానీ, చాలా మందిలో సందేహం. సల్మాన్‌కు, అర్పితకు ఎలాంటి పోలికలూ లేవేంటా.. అని! ఎందుకంటే ఆమె సల్మాన్‌ సొంత చెల్లి కాదు. ముగ్గురు అన్నల ముద్దుల దత్తత సోదరి. సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీమ్‌ ఖాన్‌. షోలే, హాథీ మేరీ సాథీ, జంజీర్‌, మిస్టర్‌ ఇండియాలాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్లను అందించిన రచయితల జంట సలీమ్‌-జావేద్‌ల్లో సలీమ్‌ ఈయనే. సలీమ్‌ఖాన్‌ మొదటి భార్య మహారాష్ట్రకు చెందిన సుశీల చరక్‌. దరిమిలా ఆమె తన పేరును సల్మాఖాన్‌గా మార్చుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు. సల్మాన్‌ ఖాన్‌, అర్భాజ్‌ఖాన్‌, సొహాయిల్‌ ఖాన్‌. వీరు ముగ్గురూ కొడుకులు. కూతురు పేరు అల్విరా ఖాన్‌. 1964లో సుశీలను వివాహం చేసుకున్న సలీమ్‌ఖాన్‌.. మళ్లీ 1981లో శృంగార పాత్రల వేషధారిణి హెలెన్‌ను వివాహం చేసుకున్నారు. అర్పితను దత్తతు తీసుకుంది హెలెనే అని ఒక కథనం. ఒక అనాథ మహిళ రోడ్డు మీద చనిపోగా.. ఆమె కుమార్తె అయిన అర్పితను హెలెన్‌, సలీమ్‌ఖాన్‌ చేరదీసి పెంచారని మరో కథనం. సలీమ్‌-హెలెన్‌ దంపతులు అర్పితను తమ బిడ్డలతో సమానంగా చూసుకున్నారు. సల్మాన్‌, అర్భాజ్‌, సొహైల్‌, అల్విరా సైతం.. ఆమెను తమ సొంత చెల్లెల్లాగానే చూసుకునేవారు. సల్మాన్‌ఖాన్‌ అయితే షూటింగుల్లో చిన్నారి అర్పితతో కలిసి ఫొటోలు దిగేవాడు. క్రమంగా ఆమె బాలీవుడ్‌ సినిమా సర్కిల్‌లో సల్మాన్‌ సోదరిగా అల్విరా కన్నా ఎక్కువగా పాపులర్‌ అయిపోయింది. షారుక్‌ఖాన్‌ సైతం ఆమెను తన సొంత చెల్లెల్లా భావించి బహుమతులతో ముంచెత్తేవాడు. కానీ, 2008లో కట్రీనాకైఫ్‌ పుట్టినరోజు పార్టీలో కింగ్‌ఖాన్‌, సల్మాన్ల మధ్య గొడవ జరగడంతో ఇద్దరి మధ్యా మాటలు కట్‌ అయ్యాయి. మళ్లీ అర్పిత పెళ్లి నేపథ్యంలో షారుక్‌ఖాన్‌ ఆరేళ్ల తర్వాత మళ్లీ సల్లూ భాయ్‌ ఇంట అడుగుపెట్టాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలకు చెందిన రకరకాల హ్యాండ్‌బ్యాగులను ఆమెకు బహుమతిగా ఇచ్చి గంటకు పైగా వారింట గడిపాడు. ఇక.. సల్మాన్‌ అయితే, ఈ పెళ్లికి రూ.22 కోట్ల దాకా ఖర్చు చేశాడు. అంతేనా.. తన ముద్దుల చెల్లెలికి వివాహ కానుకగా ముంబైలోని ఖరీదైన ఏరియాలో, తమ కుటుంబం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు దగ్గర్లో రూ.16 కోట్లు పెట్టి త్రీ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌కొనిచ్చాడు.

ఇంకొన్ని విశేషాలు..
అర్పిత తన ఉన్నత విద్యాభ్యాసాన్ని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌లో చేసింది. ప్రస్తుతం ఆమె ముంబైలో ఒక ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థలో పనిచేస్తున్నట్టు సమాచారం.
ఫ అర్పిత భర్త ఆయుష్‌ శర్మ తాతతండ్రులు (సుఖ్‌రామ్‌ శర్మ, అనిల్‌ శర్మ) రాజకీయాల్లో ఉన్నారు. దీంతోపాటు వారికి వ్యాపారాలు కూడా ఉన్నాయి. అతడు అటు రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. లేదా వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ, ఆయుష్‌కి మాత్రం బాలీవుడ్‌ని దున్నేయాలని కోరిక. అందుకే నటుడిగా తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలనుకుంటున్నాడు. సల్మాన్‌ఖాన్‌ అంతటి వ్యక్తే అండగా దొరికితే ఇక బాలీవుడ్‌లో అవకాశాలనగా ఎంతంటారు..!