రెండు రోజులుగా తమిళ సినీ మీడియాలో, ఆన్‌లైన్ వేదికల్లో ఎక్కడ చూసినా త్రిష నామస్మరణే. వ్యాపారవేత్త, తమిళ చిత్రాల నిర్మాత అయిన వరుణ్ మణియన్‌తో త్రిషకు పెళ్ళి కుదిరిందన్న వార్తే దీనికి కారణం. నిజానికి, నటుడు రానా, త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం చాలాకాలం వార్తల్లో నిలిచినా, ఆ అనుబంధం తెగిపోయిందనీ, వరుణ్‌తో ఉన్న చిరకాల స్నేహం బలపడిందనీ కోడంబాకమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కొన్నాళ్ళుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ కలిసున్న ఫోటోలు కూడా నెట్‌లో షికార్లు చేస్తున్నాయి. అయితే, తమ మధ్య బంధాన్ని కథానాయిక త్రిష అధికారికంగా అంగీకరించనూ లేదు. అలాగని తోసిపుచ్చనూ లేదు. ఈ నేపథ్యంలో త్రిష నిశ్చితార్థం కబురు నిజమేనని అందరూ భావించారు.
చివరకు ఏమనుకున్నారో ఏమో త్రిష ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని నిశ్చితార్థం కబుర్లన్నీ అబద్ధమంటూ వివరణ నిచ్చారు. ‘‘నాకు నిశ్చితార్థం జరగలేదు. నిశ్చితార్థం జరిగినప్పుడు నేనే ముందుగా ఆ వార్త చెబుతాను’’ అని ఈ చెన్నై సుందరి ట్వీట్ చేశారు. అయితే, త్రిష ట్వీట్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. నటి రాయ్ లక్ష్మి అయితే త్రిష తన వ్యక్తిగత జీవిత వాస్తవాలను తోసిపుచ్చే బదులు నిజం ఒప్పుకోవాలంటూ ట్వీట్ చేశారు. ‘‘ఎవరైనా సరే తమ వ్యక్తిగత జీవితం గురించి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నిజాన్ని ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్పడం ఎందుకు?’’ అని ఆమె అన్నారు. రాయ్ లక్ష్మి మాటలు చూస్తుంటే, త్రిషకు నిజంగా నిశ్చితార్థం అయినట్లే ఉంది. మరి, త్రిష అధికారికంగా ఆ కబురు ఎప్పుడు చెబుతారో?