Thursday, 13 November 2014


అంకెల గారడి, అరచేతిలో స్వర్గం, ఊహా జనిత లెక్కలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విపక్షాలు నిలదీస్తే ... మాటల మాంత్రికుడైనా కేసిఆర్ తనదైన శైలిలో ఇచ్చిన సమాధానం చిత్రంగా వుంది. తెలంగాణ వస్తుందని తాను పోరాడితే అందరూ అది అసాధ్యం అన్నారని, కేవలం తెలంగాణ సెంటిమెంటును రాజకీయంగా వాడుకుంటున్నారని , కాని తాను సాధించి చూపానని చెప్పుకొచ్చారు. అంత పెద్ద సాధించిన తనకు అభివృద్ది సాధన ఏపాటి.... మున్ముందు మీరే చూడండి.. అధ్భుతాలు జరుగుతాయి.. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయం ఎంతో లేదు... అప్పుడు వహ్వా ఎంత అధ్బుతం అని అంటారన్నారు. 

వినడానికి కెసిఆర్ మాటలు గమ్మత్తుగా బాగానే వున్నాయి. సరే కేసిఆర్ లెక్కల ప్రకారం అద్బుతం జరుగుతుందనుకుందాం. అంటే లక్ష్యాన్ని ఆస్థాయిలో నిర్దేశించుకోవాలి. అదే స్థాయిలో దానికి బడ్జెట్ కేటాయింపులుండాలి. అప్పుడు సాధించకపోయినా.. ఆ ధిశగా ప్రయత్నం అయితే చేస్తున్నారు అనుకుంటున్నారు. తెలంగాణ బాగుపడాలంటే ముందుగా రైతులు బాగుపడాలి. కారణం తెలంగాణ మేజర్ గా వ్యవసాయం రంగంపైనే ఆధారపడి ఉంది. అంటే రైతులకు బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్య అంటే విద్యుత్ అయినా... రుణమాఫీ అయినా, చెరువుల మరమ్మతులు అయినా.. ఇలా ఏది చూసినా రైతుల చుట్టే తిరుగుతోంది. అలాంటి రైతుల  కోసం కేసిఆర్ కేటాయింపులు ఎలా ఉన్నాయో చూస్తే ఆ అధ్భుతం ఏ మేరకు జరుగుతుందనేది అర్థం చేసుకోవచ్చు. 

వర్షాభావం వంటి ప్రక్రుతి విపత్తులతో పంటలు పండక, అంతో  ఇంతో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, వచ్చే ఆధరకు విక్రయించుకుందామన్నా.. సరిగా మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ  వసతులు కల్పించేందుకు బడ్జెట్ కేటాయింపులుండాలి. బడ్జెట్ లో మాత్రం గతలం ఎన్నడూ లేని విధంగా ఈ సారి వ్యవసాయ అనుబంద రంగాలకు 20శాతం కేటాయింపులు జరిపామని ప్రకటించారు. ఇంతకీ ప్రకటించిన బడ్జెట్ ఎంత అంటే వ్యవసాయరంగానికి ప్రణాలికేతర బడ్జెట్ లో రూ.4,772కోట్లు కేట్లాయించారు. వామ్మో.. ఇన్ని కోట్లా.. అని నోళ్లు తెరవద్దు, ఇందులో రూ.4250కోట్లు రుణమాఫీ పద్దుకింద కేటాయించారు. అంటే మిగిలిదెంత...కేవలం రూ.520కోట్లు. ప్రణాలిక వ్యయం కింద రూ.2335కోట్లు కేటాయించారు. వీటిలో పంటల భీమాకోసం రూ.118 కోట్లు కేటాయించారు. ఈ సారి భీమా ఎవరికి చేయలేదు కాబట్టి ఈ నిధులు సర్కారుకే మిగిలిపోతాయి. పైగా 330 కరువు మండలాలని ప్రభుత్వమే ప్రకటించి వాటికి పరిహారాన్ని మాత్రం ప్రకటించలేదు. సర్కారును కుదిపేస్తున్న రైతుల ఆత్మహత్యలు, వారి కుటుంబాలను ఆదుకోవాడానికి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ప్రకటించలేదు. ఇలాంటి కేటాయింపులతో రైతుల జీవితాల్లో అధ్భుతాలను ప్రభుత్వం ఎలా సృష్టిస్తుందో చూడాలి.