డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్, చాలెంజర్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మధ్య గురువారం జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ తొమ్మిదో గేమ్ డ్రాగా ముగిసింది. కేవలం 20 ఎత్తులకే ఈ గేమ్‌ను డ్రాగా ముగించాలని ఇద్దరు ఆటగాళ్లు నిర్ణయించడం విశేషం. వీరి మధ్య గత ఏడాది జరిగిన, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇదే అత్యంత చిన్న గేమ్. సోమవారం వీరు 122 ఎత్తుల వరకూ పోరాటం సాగించి చివరికి రాజీకి వచ్చారు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలోనే అది అత్యంత సుదీర్ఘమైన పోరు. కాగా, తొమ్మిదో గేమ్ డ్రా కావడంతో కార్ల్‌సెన్ పాయింట్లు ఐదుకు చేరగా, ఆనంద్ నాలుగు పాయింట్లతో ఉన్నాడు. మరో మూడు గేమ్స్ జరగాల్సి ఉండగా, కనీసం ఒక విజయం అతనికి అత్యవసరంగా మారింది.
గతంలో ఐదు పర్యాయాలు ప్రపంచ టైటిల్‌ను సాధించిన ఆనంద్‌కు కార్ల్‌సెన్ అడ్డంకులు సృష్టిస్తూ, అతని వేగాన్ని అడ్డుకుంటున్నాడు. దీనితో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న ఆనంద్ తన ప్రత్యర్థి చేసిన పొరపాట్లను తనకు అనుకూలంగా మాలచుకోవడంలో విఫలమవుతున్నాడు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, అతను కార్ల్‌సెన్ ఆధిపత్యానికి తలవంచి ప్రపంచ టైటిల్‌ను మరోసారి అతనికే కట్టబెట్టడం ఖాయం. వేగంగా ఎత్తులు వేసే ర్యాపిడ్ చెస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచే ఆనంద్ సంప్రదాయ ఫార్మెట్‌లో కొనసాగుతున్న ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ చివరి మూడు గేమ్స్‌లో ఏ స్థాయిలో చెలరేగుతాడో చూడాలి. ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్న కార్ల్‌సెన్ ఖచ్చితంగా డ్రాలకే మొగ్గుచూపుతాడు. అందుకే దూకుడును పెంచాల్సిన అవసరం ఆనంద్‌కు ఏర్పడింది.