Thursday, 20 November 2014


హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరును పెట్టారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. బేగంపేట విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు వుండేది. అయితే శంషాబాద్ విమానాశ్రయం కట్టిన తర్వాత విమానాశ్రయం మొత్తానికీ రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అయితే విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరును పెట్టకుండా ఇంతకాలం నిర్లక్ష్యం వహించారు. ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎంతగా డిమాండ్ చేసినా గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ తెలుగువారిని అవమానించింది. తెలంగాణ ప్రాంతంలోని కొన్ని శక్తులు కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ పేరు కనిపించకుండా వుండాలని కంకణం కట్టుకున్నాయి. అయితే ఇంతకాలానికి ఆ మహాపురుషుడి పేరును శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్‌కి పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.