ముంబయి, నవంబర్ 19: సస్పెన్షన్‌కు గురైన మహిళా బాక్సర్ లైష్రామ్ సరిత దేవికి మద్దతునివ్వాలంటూ కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్‌కు భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ లేఖ రాశాడు. ఇంచియాన్ ఏషియాడ్‌లో తనకు అన్యాయం జరిగిందంటూ రోదించిన సరిత కాంస్య పతకాన్ని స్వీకరించడానికి నిరాకరించడంతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ కమిటీ నివేదిక అనంతరం మరింత కఠిన చర్య ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, దేశానికి ప్రాతినిథ్యం వహించి, పతకాలను సాధించిపెట్టిన సరతకు కష్టసమయంలో అండగా నిలవాలని సోనోవాల్‌కు రాసిన లేఖలో సచిన్ కోరాడు. తప్పు చేసినట్టు ఆమె ఇప్పటికే అంగీకరించిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. ఎఐబిఎ అధికారులతో సంప్రదించి, సరితపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయించాలని సచిన్ విజ్ఞప్తి చేశాడు.