కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పర్యాటక శ్రీలంక జట్టుతో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా సరికొత్త రికార్డును సృష్టించి చరిత్రపుటలకెక్కాడు. అంతేకాకుండా, వన్డేల్లో రెండు సార్లు డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ చివరి బంతికి (49.6) అవుట్ అయ్యాడు. 173 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 152.60 స్ట్రైక్ రేటుతో 264 పరుగులు చేశాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. రెండు నెలల తర్వాత జట్టులోకి శిఖర్ ధావన్ స్థానంలో వచ్చిన రోహిత్ ఓపెనర్‌గా మరోసారి నిరూపించుకున్నాడు. పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
గతంలో ఆస్ట్రేలియాపై 2013 నవంబర్ రెండో తేదీన రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీ (209) చేశాడు. తాజాగా కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రోహిత్ శర్మ వీరవిహారం చేసి ఏకంగా 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు.
మరోవైపు.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి నాలుగు ద్విశతకాలు మన క్రికెటర్లు చేసినవే కావడం గమనార్హం. తొలుత సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్) సౌతాఫ్రికాపై తొలి డబుల్ సెంచరీ చేయగా, తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (219) వెస్టిండీస్‌పై 2011లోనూ, 2013లో రోహిత్ శర్మ (209), 2014లో రోహిత్ శర్మ (264) డబుల్ శతకం నమోదు చేశాడు.