Thursday, 6 November 2014

అహ్మదాబాద్ వన్డే : రాయుడు ఫస్ట్ సెంచరీ.. భారత్ ఘన విజయం!


అహ్మదాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండే వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రమోషన్ మీద వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రాయుడు... తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 101 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో వన్డే కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. మొత్తం 118 బంతులు ఆడిన రాయుడు 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 121 (నాటౌట్) పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 
 
అంతకుముందు ఓపెనర్ శిఖర్ ధవాన్ 79 పరుగులు చేయగా, రెహాన్ 8, కోహ్లీ 49 (నాటౌట్), సురేష్ రైనా 14 చొప్పున పరుగులు చేశారు. ఫలితంగా 44.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 275 పరుగులు చేసి ఐదు వన్డేల సిరీస్‌ను 2-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. లంక బౌలర్లలో ప్రసాద్, పెరేరాలు రెండేసి వికెట్లు తీశారు. 
 
అంతకుముదు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసిన విషయం తెల్సిందే. లంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (92) రాణించడంతో రెండో వన్డేలో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 274 పరుగులు సాధించింది. సంగక్కర 61, దిల్షాన్ 35 పరుగులు చేశారు. చివర్‌లో బౌలర్ దమ్మిక ప్రసాద్ (30) విలువైన పరుగులు జోడించడంతో శ్రీలంక ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 
 
ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే. అయితే, టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్లోనే శ్రీలంకను దెబ్బ తీశాడు. ఓపెనర్ పెరీరా (0)ను డకౌట్ చేయడం ద్వారా భారత జట్టులో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా భారత బౌలర్లు వికెట్లు తీయడంతో శ్రీలంక జట్టు భారీ స్కోరు చేయలేక పోయింది. 
 
శ్రీలంక క్రికెటర్లలో పెరేరా 0, దిల్షాన్ 35, సంగక్కర 61, జయవర్ధనే 4, మ్యాథ్యూస్ 92 (నాటౌట్), ప్రసన్న 13, ప్రియరంజన్ 1, పెరేరా 10, రణ్‌దివ్ 10, ప్రసాద్ 30, ఎక్స్‌ట్రాలు 18 చొప్పున చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అంబటి రాయుడు అందుకున్నాడు.