Wednesday, 19 November 2014


పూర్తి నియంత్రణలో పరిస్థితి
విమానాశ్రయాల్లో జాగ్రత్తలు కట్టుదిట్టం: మంత్రి నడ్డా

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, వాషింగ్టన్‌, నవంబర్‌ 19: భారత్‌లో ఎబోలా వైరస్‌ కనిపించిన 24 గంటల్లో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మహమ్మారి మన దేశంలోనూ వ్యాపించకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు విమానాశ్రయాల్లో ఈ వ్యాధి పరీక్షలను మరింత పకడ్బందీగా చేసేలా చూడడానికి ముగ్గురు సభ్యుల కమిటీని బుధవారం కేంద్రం నియమించింది. రక్తంలో ఎబోలా వైరస్‌ లేనప్పటికీ ఒక వ్యక్తి వీర్యంలో వైరస్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో కనుగొన్న ఏర్పాట్లే.. దేశంలోని మరో 24 విమానాశ్రయాల్లో కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎబోలాపై సమీక్ష చేసేందుకు నడ్డా నేతృత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం జరిగింది. ఆరోగ్య, పౌర విమానయాన, ఇమిగ్రేషన్‌ శాఖలతో ఒక కమిటీని వేశామని నడ్డా తెలిపారు. ఈ కమిటీ ఒక వారం లో తన నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ఆయన అన్నారు. నవంబర్‌ 10వ తేదీన లైబీరియా నుంచి భారత్‌కు వచ్చిన వ్యక్తిలో ఎబోలా వైరస్‌ను గుర్తించడం మనం తీసుకు న్న ముందు జాగ్రత్త చర్యల వల్లే సాధ్యమైందని మంత్రి నడ్డా చెప్పారు. లైబీరియాలో ఎబోలా వ్యాధి సోకి నయమైన ఆ వ్యక్తి రక్తంలో వైరస్‌ లేదని, వీర్యంలో మాత్రమే కనిపించిందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే జాగ్రత్తలనూ ప్రభుత్వం తీసుకుంటోందని నడ్డా తెలిపారు. విదేశాల నుంచి దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్న 24 విమానాశ్రయాల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జాగ్రత్తలు తీసుకుని, అనుమానితులను వేరుగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశామని ఆయన వివరించారు. విమానాశ్రయాలతో పాటు నౌకాశ్రయాల్లోనూ ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎబోలా వ్యాధి నయమైన వారు, ఆ తేదీ నుంచి 90 రోజుల వరకూ భారత్‌లో ప్రవేశించకుండా నిషధం విధించారు. ఆ తరువాత పరీక్షలు జరిపి అనుమతిపై నిర్ణయిస్తారు. అయితే.. ఆరోగ్య శాఖ మంత్రి చెప్పినట్లు 24 విమానాశ్రాయాల్లో ఎబోలా అనుమానితులను వేరుగా ఉంచడానికి ఏర్పాట్లు లేవని కేంద్ర బృందం ఒకటి కనుగొంది. ఆరోగ్య శాఖ చేసిన తనిఖీల్లో ఢిల్లీ,. ముంబై విమానాశ్రాయాల్లో మాత్రమే అనుమానితులను వేరుగా ఉంచడానికి ఏర్పాట్లు ఉన్నట్లు గుర్తించారు.
మిగిలిన విమానాశ్రయాల్లోనూ, వీరిని వేరుగా ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని ఆరోగ్య శాఖ పేర్కొంది. సమీక్షలో భాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం అథారిటీ ఒక ప్రకటన చేసింది. ఈ విమానాశ్రయంలో ఎబోలాకు గురైన ఒక్క ప్రయాణికుడిని కూడా గుర్తించలేదని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ప్రాంతీయ అధికారి డాక్టర్‌ జూపాక మహేశ్‌ తెలిపారు. ఇక్కడ పరీక్షా కేంద్రాల్లో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. కాగా.. ఎబోలా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి అమెరికాలో ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఎబోలా వైరస్‌ జన్యువులను పరిశీలించడానికి సులువైన, వేగవంతమైన, చౌకైన పద్ధతిని శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. దీంతో ఎబోలా వ్యాప్తిని మరింత వేగంగా, సమర్థవంతంగా అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా, శాంపుళ్లలో దొరికే కొద్దిపాటి వైరస్‌ ఆర్‌ఎన్‌ఏనే మానవ ఆర్‌ఎన్‌ఏతో కలిసిపోయి గుర్తించడం కష్టమవుతోంది. కొత్త పద్ధతిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎబోలా వైరస్‌ను గుర్తించవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఎబోలా కట్టడి కోసం సాయంగా సియర్రా లియోన్‌కు తాము పంపిన 165 మంది సభ్యుల బృందంలో ఫెలిక్స్‌ బాయెజ్‌ సారియా అనే డాక్టర్‌కు ఎబోలా సోకిందని క్యూబా ప్రకటించింది. ఏ దేశమూ చేయనట్లు.. సియర్రా లియోన్‌కు 256 మందిని పంపిన క్యూబా అంతర్జాతీయ సమాజం ప్రశంసలు అందుకోవడం తెలిసిందే.