Thursday 27 August 2015

వరమహాలక్ష్మీ వత్రం రోజున ముఖ్యంగా చేయాల్సినవి మరియు చేయకూడనివి:
శ్రావణ మాసం కొత్త అందాలు, కొత్త మొలకలు, పచ్చదనాలు మొదలయ్యే చల్లని మాసం. వర్షాకాల వైభవంలో శ్రావణ మాసం పవిత్రమైన దేవీ పూజలకు తరుణం. ‘ఆర్ద్రాం పుష్కరిణీం' అని శ్రీ సూక్తం వర్ణించినట్లు - ఆర్ద్రత కలిగిన కరుణ రసస్వరూపిణి జగదంబను గౌరిగా, లక్ష్మీ దేవిగా ఆరాధించే మాసమిది. శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారం, పౌర్ణమి వంటి పావన పర్వాలు ఈ నెలకు ప్రత్యేక శోభను సంతరిస్తాయి. 


శ్రావణ మాసంలో సంపదలు పెంచుకునేందుకు వ్రతాలు, పూజలు చేస్తుంటారు భక్తులు. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు.. ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్త్థెర్యం, విజయం, వీర్యం, అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, పశువులు, పుత్రపౌత్రాదులు, కీర్తిప్రతిష్ఠలు, సుఖసంతోషాలు ఇవన్నీ సంపదలే. వీటన్నింటి అధినేత్రి మహాలక్ష్మి. అందుకే భక్తులు ఈ మాసంలో మహాలక్ష్మిని ఎక్కువగా పూజిస్తారని చెబుతారు.

శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో గల 15 రోజులు ఎంతో విశేషమైనవి. సోమవారం శివపూజ, మంగళవారం గౌరీ పూజ, శుక్రవారం లక్ష్మీపూజ, శనివారం మహావిష్ణు పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వాసం. ఈ మాసంలో మహిళలు ప్రధానంగా మూడు వ్రతాలు నిర్వహిస్తారు. ఇందులో సోమవారం వ్రతం ఎంతో విశిష్ఠమైంది. ఈ రోజు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేస్తారు. కొత్తగా పెళ్త్లెన యువతులు ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం ఆచారిస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వత్రం నిర్వహిస్తారు. సుసౌధన వ్రతం, అవ్యంగస్తమీ వ్రతం, పుష్పాష్టమి వత్రం, అవంగ వ్రతం, గౌరీ వ్రతం నిర్వహించడం శ్రావణ మాసం ప్రత్యేకత. మహిళలకు ప్రత్యేమైన శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం. వరమహా లక్ష్మీ పూజను జరుపుకుంటారు. హిందు సాంప్ర‌దాయంలో వ‌ర‌ల‌క్ష్మివ్ర‌తంకు ఎంతో ప్రాముఖ్య‌త సంపాదించుకుంది. త‌ర‌త‌రాలుగ ఆచ‌రించే సాంప్ర‌దాయం ఎలా అనే దానిపై చాలా ప్రాంతాలలో ఒక్కోక్క‌రు ఓక్కో విధంగా వ్రతం చేసుకుంటుంటారు.


వరమహాలక్ష్మీ వ్రత కత: 
సూత పౌరాణి కుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి యిట్లనియె : ముని వర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పెను. దానిని చెప్పెదను వినుడు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు, వైడూర్యములు, మణులు, మొదలగు వాటితో కూడిన సింహాసన మందు పరమేశ్వరుడు కూర్చుండి యుండగా పార్వతీ దేవి పరమేశ్వరునకు నమస్కరించి ‘దేవా ! లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు ,పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతము నాకు చెప్పు మనిన ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలికెను. ‘ఓ మనోహరీ ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగ చేసెడి వరలక్ష్మీ వ్రతము అను ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్ర పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడు చేయవలయు ‘ ననిన పార్వతీ దేవి యిట్లనియె . ‘ఓ లోకారాధ్యా ! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయ వలయును? ఆ వ్రతమునకు విధియేమి? ఏ దేవతను పూజింప వలయును? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింప బడినది? వీని నెల్ల వివరముగా చెప్ప వలయు ‘ నని ప్రార్ధింపగా పరమేశ్వరుండు పార్వతీ దేవిని చూచి యిట్లనియె. ‘ఓ కాత్యాయినీ ! వరలక్ష్మీ వ్రతము వివరముగా చెప్పెదను వినుము. మగధ దేశమున కుండినము అను నొక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబుల తోడను ,బంగారు గోడలు గల ఇండ్ల తోడను గూడి యుండెను.అట్టి పట్టణము నందు చారుమతి యను నొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితా మణి భర్తని దేవునితో సమానముగా తలచి ప్రతి రోజూను ఉదయం మేల్కొని స్నానము చేసి పుష్పములచే భర్తను పూజ చేసిన పిదప అత్త మామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసికొని, గయ్యాళి గాక మితముగాను ,ప్రియముగాను సంభాషించుచుండెను. ఇంత అణకువగా ఉన్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మీకి ఆమె మీద అనుగ్రహం కలిగినది.

ఒక రోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమైన మహాలక్ష్మి ఇలా చెప్పింది. ‘ఓ చారుమతీ ! నేను వరలక్ష్మీ దేవిని ,నీయందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్ష మైతిని .శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్ర వారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములిచ్చెద ‘ నని వచించెను. చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షణ నమస్కారములు చేసి అనేక విధముల స్తోత్రము చేసి ‘ఓ జగజ్జననీ ! నీ కటాక్షంబు గలిగె నేని జనులు ధన్యులగును, విధ్వాంసులుగను , సకల సంపన్నులు అయ్యెదరు అనెను. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషము వలన మీ పాద దర్శనము నాకు కలిగెనని నమస్కరించెను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్దానంబు (అదృశ్య మయ్యెను ) నొందెను. చారుమతి వెంటనే నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ‘ ఓహొ ! మనము కలగంటి ‘మని ఆ స్వప్న వృత్తాంతమును భర్త , మామగారు మొదలైన వారితో చెప్పగా , వారు ‘ ఈ స్వప్నము చాలా ఉత్తమ మైనదని ,శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును తప్పక చేయవలసిన ‘దని , చెప్పిరి. దానికి ఆమె కుటుంబంలోని వారుకూడా సంతోషించి వ్రతం ఆచరించారు. అలా చారుమతీ దేవి చేసిన వ్రతమును లోకమంతా చేశారు. లోకమంతా చేసిన వ్రతమును మనమూ చేశాము. వ్రత లోపమైనా కధ లోపం కారాదు. భక్తి తప్పినా ఫలం తప్పరాదు. సర్వే జనాః సుఖినో భవంతు అని నమస్కారము చేయవలెను. అయితే వరలక్ష్మీ పూజ చేయునప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఒక సారి చూద్దాం:


పూజను ఏ సమయంలో జరుపుకోవాలి: 
శ్రావణ మాసంలో ఆగష్టు 28 వరలక్ష్మీ వ్రతం వచ్చినది. ఈ శుక్రమవారం రాహుకాలం ఉదయం 10.30 నుండి 12గంట వరకూ పూజ చేయకూడదు. రాహు కాలంకు ముందు లేదా రాహు కాలం తర్వాత పూజ చేయడం మంచిది. 
ష్లోకాలు: 
పూజ చేసేటప్పుడు లక్ష్మీ సహస్రనామమం మరియు లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. 

ఫలాహారాలు లేదా నైవేద్యం: 

ఈరోజు ప్రత్యేకంగా దేవుడికి పెట్టిని నైవేద్యం శెనగలు మరియు ఒబ్బట్టు (పూర్ణం పోలి), రవ్వ లడ్డు, వంటి ఫలాహారాలు తీసుకోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో ఉపవాసం తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి వారు పూజ ముగిసే వరకూ ఏమి తినకుండా పూజ ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. 

ఉపవాసం : 

ఉపవాసం ఉదయం నుండి పూజ పూర్తి అయ్యే వరకూ ఉపవాసం ఉండవచ్చు . గర్భిణీలుకు మందుల ప్రభావం ఉంటుంది. కాబట్టి, ఉపవాసం కష్టం అవుతుంది కాబట్టి, గర్భిణీలు ఉపవాసం ఉండకపోవడం మంచిది. 

వరలక్ష్మీ పూజ మిస్ అయితే ఏం చేయాలి? 

అనివార్య కారణాల వల్ల ఈ శుక్రవారం వరలక్ష్మీ పూజకు అంతరాయం కలిగితే, తదుపరి వెంటనే వచ్చే శుక్రవారం రోజును జరుపుకోవచ్చు లేదా. నవరాత్రుల శుక్రవారల్లో ఒక శుక్రవారం సెలబ్రేట్ చేసుకోవచ్చు. తోరనగ్రంథులు: పుసుపులో ముంచిన 9 ముడులు వేసిన దారము(తోరణగ్రంథులను)చేతికి తప్పనిసరిగా కట్టుకోవాలి. తోరణగ్రంథులును పూలు, అక్షింతలు జోడించి కట్టుకోవాలి. పూజా విధిలో ఇది చాలా ముఖ్యమైనది. 

చేయకూడనివి: 

వరమహాలక్ష్మీ పూజను ఎవ్వరి చేతా ఇష్టం లేకుండా చేయించకూడదు. ఇష్టం లేకుండా ప్రోద్భలంతో చేయడం వల్ల ఎలాంటి ప్రతి ఫలం ఉండదు. వరమహాలక్ష్మీ పూజను మనస్ఫూర్తిగా మరియు ఇష్టంతో...సంతోకరంగా జరుపుకోవాలి. అలాగే రీసెంట్ గా ప్రసవించిన వారు మరియు శిశువుకు 22 రోజుకూడా దాటని వారు ఈ వరలక్ష్మీ వ్రతంను జరుపుకోకూడదు.