ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ రోజు శెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా తెరిచి , ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ రోజున ఉపాధ్యాయులను జాతీయ, రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి.
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్ధి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్ధి ...సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.
అదృష్టవశాత్తూ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మన దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది. అందుకే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. "టీచర్స్ డే"గా విదేశాల్లో కూడా అతి ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటారు. మన దేశానికొస్తే సెప్టెంబర్ 5నే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్ట్రపతిగా అద్వితీయంగా తన పదవీ బాధ్యతలను నిర్వహించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) జన్మదినం కావడమే. 1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకంగలవాడు. విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చుక్కానులని ఆయన విశ్వసించేవారు. వాస్తవానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరిందీ ఆయనే. తన పుట్టిన రోజునాడు తనని అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయులను అభినందించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేకమంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం.
"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాలకోసం గుళ్ళూ, గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం. ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడనే వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.
ఇక్కడ గురు శిష్య సంబంధం కూడా చర్చించతగ్గది. ఎందుకంటే విద్యార్ధుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు. అందుకోసం అతడు ఆ విద్యార్ధితో ఎంతో చనువుగా మెలుగుతాడు. అతనితో స్నేహం చేస్తాడు. అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచివుంటాడు. అంతే కాదు ఉపాధ్యాయుడు విద్యార్ధుల భవిష్యత్తును సన్మార్గంలోకి తీసుకెళ్ళే డ్రైవర్‌గానూ, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగానూ, వివిధ రకాల పరిస్థితులను విడమరచి చెప్పడంలో సైంటిస్టుగానూ, కలబోసి వివరిస్తూ ఆపైవచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగానూ, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్‌గానూ ...ఇలా సంఘంలో ప్రతి వృత్తినీ తనలో ఇముడ్చుకొని, తానే అన్ని వృత్తులని నిర్వహించేవాడిగా విద్యార్ధికి సంపూర్ణ అవగాహన కలిగేట్లు చేస్తాడు.
విద్యార్ధి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడితో తన పని పూర్తై పోయిందనుకోకూడదు. విద్యాలయంనుంచి బైటికొచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరమవుతుంది. అప్పటివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర్నుంచి అప్పటివరకు తాను నేర్చుకున్న నడవడి, క్రమశిక్షణ మాత్రమే అతను పై అంతస్తులకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్ధి అత్యంత జాగరూకతతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువును తలుచుకుంటూ అడుగులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయంవైపే చకాచకా సగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
మాజీ రాష్ట్రపతి కలాం కూడా గతంలో ఉపాధ్యాయుడే. పదవీ విరమణ అనంతరం ఆయన మరలా ఉపాధ్యాయ వృత్తిని చేపడుతుండడం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్నీ, విశిష్టతను తెలియజేస్తుంది. ప్రపంచంలో "సార్" అని ప్రతిఒక్కరూ సంబోధించతగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దేశాధ్యక్షుడు సైతం "సార్" అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే.
సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది సర్వత్రా వాంచనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి. ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అనిపించుకున్న వృత్తి నేడు నేడు బ్రతుకు కొరకు బడి పంతులు అని వేనోళ్ళ కీర్తించబడుతుందంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన పాత్రతప్ప మరోటి కాదు.
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.
ప్రపంచంలోని పలుదేశాలు ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. ఇతరములు ఒమన్, సిరియా, ఈజిప్టు, లిబియా, కతర్, బహ్రయిన్, యు.ఏ.ఇ., యెమన్, ట్యునీషియా, జోర్డాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, మొరాకో దేశాలలో ఫిబ్రవరి 28న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు.